Revanth Reddy: తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. సీఎం కీలక వ్యాఖ్యలు.. 12 d ago
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ తల్లి విగ్రహానికి రూపమిచ్చామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబరు 9 రాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే రోజని సీఎం పేర్కొన్నారు. సోమవారం నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయ ప్రాంగణంలో జన సమూహం మధ్య తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇకపై ప్రతి సంవత్సరం ఇదే తేదీన తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలను ఊరూవాడా ప్రభుత్వమే రాష్ట్ర పండగగా నిర్వహిస్తుందని ప్రకటించారు. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ఎవరైనా మార్చాలని ఆలోచిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డిసెంబరు 9వ తేదీ తెలంగాణ ప్రజలకు ఇష్టమైన, పదికాలాలు గుర్తుపెట్టుకుని పండగ చేసుకునే సందర్భమని సీఎం అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేశామన్నారు. కృష్ణా, గోదావరి నదులు నగరంలో ప్రవహిస్తే ఎలా ఉంటుందో... తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన ఆడబిడ్డలను చూస్తే అలాగే అనిపిస్తోందన్నారు. ప్రజలు పోరాటం చేసి, అమరులై సాధించుకున్న రాష్ట్రంలో ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం అందరికీ గర్వకారణమన్నారు.
'మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిరూపం తల్లిని బహుజనులు పిడికిలి బిగించి సాధించుకున్న తెలంగాణలో వారి ఆకాంక్షల మేరకు తండాలు, గూడాలు, మారుమూల పల్లెల్లో జనబాహుళ్యంలో ఉన్నది తెలంగాణ తల్లి. నాకు ఈ విగ్రహాన్ని చూసినప్పుడు చిన్నప్పుడు మా అమ్మ ఏవిధంగా ఉండెనో.. అలానే కళ్లకు కట్టినట్టుగా కనిపించింది.
రాష్ట్ర సాధన సమయంలో రాజకీయ పార్టీలు, ఆలె నరేంద్ర, విజయశాంతి, కేసీఆర్... చాలా మంది ఉద్యమకారులు తమ రాజకీయ పార్టీల ఆలోచన, విధానాలకు అనుకూలంగా తెలంగాణ తల్లి ప్రతిమను సృష్టించుకున్నారు. 2014 తర్వాత నాటి పాలకులు ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో రాష్ట్ర గీతం, తెలంగాణ తల్లి ప్రతిమ, అవతరణ దినోత్సవాల నిర్వహణపై ఆలోచించలేదు. తెలంగాణ సమాజం పదేళ్లపాటు వివక్షకు లోనైంది. కానీ, మేం తెలంగాణ తల్లికి రూపమిచ్చి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం.
గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా ప్రముఖులు, కళాకారులు, కవులు గుర్తింపునకు నోచుకోలేదు. వారందరినీ గుర్తించి సన్మానించి, ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరి, అందెశ్రీ, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, జయరాజ్, పాశం యాదగిరి, ఎక్కా యాదగిరిరావుల త్యాగాలను నాలుగు కోట్ల మంది ప్రజలు ఎన్నటికీ మరవలేరు. వీరికి ప్యూచర్ సిటీలో 300 గజాల స్థలం, రూ. కోటి నగదు, తామ్రపత్రాన్ని అందిస్తాం'. అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.